Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ .. 15 గంటల టైమ్

0
30

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 81,224 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,093 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

వేసవి సెలవుల వల్ల రద్దీ భారీగా ఏర్పడింది. మున్ముందు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోన్నారు. ఇక అటు తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మొన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే.

ఈ నెల 9వ తేదీన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ. శ్రీ క్రోధినామ సంవ‌త్స‌ర ఉగాది పండగను అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటోన్నారు. అదే రోజున వేలాదిమంది భక్తుల సమక్షంలో శ్రీ‌వారి ఆల‌యంలో తెలుగు సంవత్సరాది ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా చేపట్టనున్నారు.

తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 17న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం, ఉదయం 8 నుంచి 9 గంటలకు శ్రీ సీత లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.