ఈ నెల 11వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుండగా.. . మంత్రులతో పాటు అధికారులు కూడా హాజరుకానున్నారు. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మార్చి 11నే సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు.
తొలుత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ వర్తింపజేసేలా విధివిధానాలను ఖరారు చేయాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఇంటి నిర్మాణం కోసం నిధులను ఏ దశలో, ఎన్ని విడతలుగా విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాల్లో చేసిన తప్పులు జరగకుండా .. అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని తెలిపారు. సొంత జాగా ఉన్నవారికి అదే స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తామని ఎన్నికల టైమ్ లోనే కాంగ్రెస్ హామీ ఇచ్చింది.