ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు జరుగుతాయి. నేటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూళ్లు కొనసాగుతాయి. అటు టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లలో ఏడు రోజుల పాటు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు.
ఒంటిపూట బడుల సమయంలో మధ్యాహ్నం భోజనం తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపాలని అధికారులు ఆదేశించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరు బయట, చెట్ల కింద తరగతులు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక.. తెలంగాణలో మార్చి 15 నుంచి ప్రారంభమయ్యాయి. ఇక అటు ఏప్రిల్ నెలాఖరు నుంచి ఏపీలో స్కూల్స్‌కు వేసవి సెలవులు ఉండనున్నాయని సమాచారం.
అటు ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హాల్‌టికెట్లను కూడా విడుదల చేసిన విద్యాశాఖ.. రాష్ట్రవ్యాప్తంగా 3,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.