తెలంగాణలో563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అప్లికేషన్లకు గడువు మార్చి14నే ముగిసినా.. టీఎస్‌పీఎస్‌సీ మరో రెండు రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాలని సూచించింది. గత నెల 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది.
మార్చి 13 వరకు 2.70 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 2022లో జారీ చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు 3.80 లక్షల మంది అప్లై చేశారు. గతంలోనూ చివరిరోజున భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈసారి కూడా అలాగే జరగవచ్చని టీఎస్‌పీఎస్సీ అంచనా వేస్తోంది.
ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ కాగా, 23 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. మార్చి 14 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు. అయితే, ఈ నెల 13 వరకు 2.70 లక్షల మంది ఈ పోస్టులకు అప్లయ్ చేసుకున్నారు. దీంతో అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ మరో అవకాశం కల్పించింది. మార్చి 16వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. దరఖాస్తు ఫీజు రూ.320 చెల్లించి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు 200రూపాయలు కాగా, పరీక్ష ఫీజు 120రూపాయలు చెల్లించాలి.