Vasantha Krishna Prasad : వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి మైలవరం ఎమ్మెల్యే

0
22

ఏపీలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలో చేరారు. శనివారం ఉదయం హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్‌ వెళ్లారు. అక్కడే ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్‌కు కండువా కప్పిన చంద్రబాబు.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నట్లుగా ఇటీవల వసంత కృష్ణప్రసాద్‌ చెప్పారు. విపక్ష నేతలను తిట్టే వారికే వైసీపీలో టికెట్లు ఇస్తారని ఆరోపించారు.

వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నందిగామ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 2004లో రెండవసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2005లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీ బ్యాంకు) చైర్మన్‌గా, ఆప్‌కాబ్‌ చైర్మన్‌గా, జాతీయ స్థాయిలో నాప్కాబ్‌ వైస్‌ చైర్మన్‌గా పని చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆప్‌కాబ్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు.

2014 లో టీడీపీలో చేరి ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి తంగిరాల ప్రభాకరరావు గెలుపులో కీలకంగా పని చేశారు. 2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పని చేశారు. ఇక 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమా పై 12 వేల 653ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తాజాగా వైసీపీని వీడి మళ్లి సొంతగూటికి చేరుకున్నారు.