ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో తనకు టికెట్ రాకుండా తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ధ్వజమెత్తారు. భట్టి విక్రమార్క తనకు ద్రోహం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఖమ్మం టికెట్ తనకు రాకుండా భట్టి ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థంకావడం లేదని అన్నారు. మొదట ఆ స్థానం నుంచి తనకే అవకాశం ఇస్తానని ఒప్పుకున్నారని, కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపించే వేళ తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరని, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తనకు న్యాయం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టుకుని గద్గదస్వరంతో మాట్లాడారు. భట్టి విక్ర మార్క ఈ రోజు పార్టీలో ఈ స్థానంలో ఉన్నారంటే అందుకు తానే కారణమని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం పదవులు ఆశించకుండా పనిచేస్తూ వచ్చానని, గత ఏడేళ్లుగా తనకు ఏ పదవీ ఇవ్వలేదని గుర్తుచేశారు.
ఖమ్మం తనకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, బీసీల ఓట్లు పార్టీకి అవసరం లేదా అని ప్రశ్నించారు. బీసీలను కేవలం ఓట్లు వేసే మిషన్లుగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ‘న్యాయ’ యాత్ర, బీసీ కులగణన అంటున్నారని, ఆయనే న్యాయం చేయాలని అన్నారు.