YS Jagan : ఉమెన్స్ డే స్పెషల్.. బటన్ నొక్కి డబ్బులు పంచనున్న జగన్

0
20

ఆంధ్రప్రదేశ్ లో బటన్ నొక్కి డబ్బులు పంచడంలో జగన్ ది ఆల్ టైమ్ రికార్డ్. ఎన్నికలు దగ్గరపడటంతో రాజకీయ పార్టీలన్నీ ఓట్ల కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ.. అన్ని ఆకర్ష అస్త్రాలు బయటకు తీస్తోంది. ప్రజల్లోకి మరింత దూకుడుగా వెళ్లేందుకు రెడీ అయింది.

పొలిటికల్ సభలు, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తోంది వైసీపీ. ఎన్నికల వేళ మరో పథకం ద్వారా లబ్ధిదారులకు డబ్బులను అందజేయనుంది వైసీపీ ప్రభుత్వం. వైఎస్సార్‌ చేయూత పథకం నిధులను సీఎం జగన్‌ అనకాపల్లిలో బటన్‌ నొక్కి మహిళల అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ ఖరారు చేసింది. సీఎం జగన్‌ సభకు అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాగా.. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి రూ.18,750 ఇస్తున్నారు. ఇప్పటికే మూడు విడతలుగా డబ్బులు జమ చేసింది. ఇప్పుడు చివరి విడత నిధులను మార్చి 7వ తేదీన విడుదల చేయనున్నారు.

31లక్షల 23వేల మంది మహిళలు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని మహిళలకు ఏడాదికి రూ.18,750 ఆర్థిక సాయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మార్చి 8న మహిళల దినోత్సవం ఉంది. దానికి ముందు ఒక్కరోజు ఈ పథకం ద్వారా మహిళల అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఎన్నికల ప్రకటన రాకముందే పంచేవన్నీ అధికారికంగా పంచేయాలని వైసీపీ డిసైడ్ అయింది. పదో తేదీన అద్దంకిలో సిద్ధం సభతో టీడీపీ, జనసేనకు షాకివ్వాలని చూస్తోంది.