విజయవాడ : ఎన్నికల ప్రచారంలో బాగంగా గురువారం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడలో పర్యటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నేడు రాష్ట్రానికి రాజధాని కూడా లేదని.. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదని మండిపడ్డారు. మన రాష్ట్రానికే ఈ దుస్థితి అని.. ఈ పరిస్థితికి అధికార పార్టీ, టీడీపీనే కారణం అని షర్మిల ధ్వజమెత్తారు. నాడు చంద్రబాబు ఆంధ్ర మరో సింగపూర్ అవుతుందని అన్నడు అని.. 3D గ్రాఫిక్స్ చూపించి, 30 వేల ఎకరాలు తీసుకున్నారని ఆరోపించారు. అలానే 2015లో మోడీ వచ్చి భూమి పూజ చేశాడని.. యమునా నది నుంచి మట్టి కూడా తెచ్చాడని.. చివరికి మనకి మట్టే మిగిల్చారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఢిల్లీని తలదన్నే రాజధాని ఉండాలని మోదీ.. సింగపూర్ లాంటి రాజధాని కడతానని బాబు.. ఆనాడు ప్రగల్బాలు పలికారని.. చివరికి అమరావతి కాస్త భ్రమరావతి అయ్యిందని షర్మిల ఎద్దేవ చేశారు.
ఇక జగన్మోహన్ రెడ్డి తాను గెలిస్తే ఆంధ్ర మరో Washington, D.C. అవుతుందని గాల్లో మెడలు కట్టారని.. అధికారంలోకి వచ్చాక ఒక్కటి కాదు మూడు రాజధానులు కడతానని చెప్పిన జగన్ ఒక్కటన్నా కట్టాడా అని ప్రశ్నించారు. మూడు కాదు కదా ఒక్క రాజధానికి కూడా దిక్కులేదని అసహనాన్ని.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని వైఎస్ షర్మిల మండిపడ్డారు.